
తేది:21- 01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా : జగిత్యాల గ్రామపంచాయతీ సర్పంచుల ఓరియంటేషన్ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క.బుధవారం రోజున జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నూకపల్లి న్యాక్ సెంటర్ లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ, RWS మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి ధనసరి అనసూయ (సీతక్క), జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో మూడు విడతలుగా 385 మంది సర్పంచ్ లకు శిక్షణ అందిస్తున్నామని ఈ నెల 19 నుండి 23 వరకు నూతనంగా ఎన్నికైన సర్పంచులకు మొదటి విడుత 122 సర్పంచ్ లకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఇక్కడికి ఆహ్వానించినందుకు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ కు అభినందనలు తెలిపారు.
గ్రామ పంచాయితీ ఎన్నికలలో ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు పెట్టుకొని, ఎదురైన ఇబ్బందులను తట్టుకొని ప్రజల చేత ఎన్నికైన సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, గుర్తించిన సమస్యలను వేగవంతంగా పరిష్కరించే విధంగా పట్టుదలతో ముందుకు వెళ్లాలని సూచించారు. మనం శాశ్వతం కాదు, మన పదవులు శాశ్వతం కాదు, కానీ మనం చేసే పనులు ఎప్పటికీ శాశ్వతం అని ప్రజలకు ఎల్లప్పుడూ గుర్తు ఉంటాయని తెలిపారు. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు చేరుతాయని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు, పన్నులు ముఖ్యంగా గ్రామాలను అభివృద్ధి పరచాలంటే పాలనాపరంగా ఏం కావాలో ఈ శిక్షణ కార్యక్రమంలో తెలుసుకోవచ్చని అన్నారు. మన గ్రామాన్ని అభివృద్ది చేసుకుంటే మన తల్లికి సేవ చేసినట్లే, మన గ్రామానికి మంచి పని చేస్తే గ్రామ ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. మనపేరు గ్రామంలో చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా అహర్నిశలు పనిచేయాలి. సర్పంచులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ సుపరిపాలన అందించి గ్రామాలను అభివృద్ధి పరుస్తూ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కోరారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం లో వచ్చిన మార్పులను కూడా సర్పంచ్ లు గమనించాలని, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకుంటూ పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.
గ్రామంలో నిరుపేదలను గుర్తించాలని వారికి ప్రభుత్వం ద్వారా లబ్ది అందేలా చూడాలని, బాల్య వివాహాలపై అవగాహనా కల్పించాలని, యువతకు నైపుణ్య శిక్షణ అవకాశాలు అందేలా చూడాలని గ్రామ ప్రథమ పౌరులు గా మీరు అన్ని వర్గాల అభివృద్ధి కి మరియు గ్రామ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలని కోరారు.
తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇటీవల గ్రామ పంచాయితీలకు 277 కోట్లు మంజూరు చేసిందని గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన కేంద్ర ప్రభుత్వ నిధులు 2000 కోట్లు త్వరితగతిన వచ్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. వచ్చిన నిధులను గ్రామంలో ప్రాధాన్యత ప్రకారం మరియు గ్రామసభలో తీసుకున్న తీర్మానాల ప్రకారం ప్రజా ఉపయోగ పనులను గుర్తించి వాటికోసం వినియోగించాలని తెలిపారు.
గ్రామాల్లో సర్పంచులుగా ఎన్నికైన మీరు పంచాయితీ కార్యదర్శులను అలాగే ఇతర అధికారులను మరియు ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని సుపరిపాలన అందించాలని మీ గ్రామాలను ఆయా గ్రామాలని ఆదర్శవంతమైన గ్రామాలుగా మరియు ఉత్తమ గ్రామాలుగా తీర్చిదిద్దే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేరళ రాష్ట్ర గ్రామాలను ఆదర్శంగా తీసుకుని మీరు కష్ట పడి పనిచేసి మీ గ్రామాలను అభివృద్ధి లో ముందంజ లో ఉంచి ఉత్తమ గ్రామాలుగా అవార్డులు సాధించే విధంగా కృషి చేసి దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచాలని అలాగే జగిత్యాల జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంచే విధంగా మీరంత కష్టపడి పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జెడ్పీ సి.ఈ.ఓ గౌతం రెడ్డి, DRDO రఘువరన్, డిప్యూటీ సిఈవో పి. నరేష్, జిల్లా పంచాయతీ అధికారి మదన్మోహన్, DWO బి. నరేష్, పంచాయతీ రాజ్ ఈఈ లక్ష్మణ్ రావు, శిక్షణ జిల్లా పంచాయతీ అధికారి, రేవంత్, ఎంపిడివోలు, ఎంపివోలు, టివోటిలు, సంబంధిత అధికారులు, డిపివో కార్యాలయ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.