పేదల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం-రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.2.54 కోట్ల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ.

తేది:20-01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.

సంగారెడ్డి జిల్లా: మహిళా సాధికారత, పిల్లలకు నైపుణ్యాలతో కూడిన ప్రమాణవంతమైన విద్య, పేదల ఆరోగ్య భద్రతకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
మంగళవారం సంగారెడ్డిలోని పి.ఎస్.ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గ పరిధిలోని కంది, కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకం కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మొత్తం రూ.2.54 కోట్ల విలువైన చెక్కులను 254 మంది లబ్ధిదారులకు మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు సామాజిక, ఆర్థిక, విద్యా, వైద్య భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు. ఆ దిశగా పేదల ఆరోగ్య భద్రత, వైద్య రక్షణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందన్నారు. మహిళల ఉన్నతికి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, పిల్లలకు నైపుణ్యాలు, ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.
స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంలో భాగంగా వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా బాల భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. వయోవృద్ధుల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకుని ప్రణాము కార్యక్రమం ద్వారా వృద్ధుల డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసిందని మంత్రి వివరించారు.
ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదేనని, ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్య చికిత్సలు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకప్పుడు క్యాన్సర్ చికిత్స కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోనే క్యాన్సర్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో కంటి సంబంధిత కాట్రాక్ట్ శస్త్రచికిత్సలు సహా అన్ని ఆధునిక వైద్య సేవలను సంగారెడ్డి ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు.
టి.జి.ఐ.ఐ.సి చైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, అడగకుండానే ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని అందించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాల అండగా నిలుస్తోందన్నారు. ఇంటి స్థలం ఉన్నా లేకపోయినా ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాభివృద్ధికి పాటుపడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, ఆర్డిఓ రాజేందర్, డాక్టర్ మౌనిక, తహసిల్దార్లు, లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *