తేది:20-01-2026 కరీంనగర్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ గొడిశల రమేష్.
కరీంనగర్ జిల్లా: హుజురాబాద్ సహాయక కార్మిక అధికారి కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణ యాదవ్ జిల్లా కలెక్టర్‌కు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ, హుజురాబాద్ కార్మిక కార్యాలయంలో అధికారిక కంప్యూటర్ యూజర్ ఐడీలు, పాస్‌వర్డులను అనధికార వ్యక్తులకు అప్పగించి కార్మికులకు సంబంధించిన కీలక దస్త్రాల వెరిఫికేషన్ చేయిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ చర్యల వల్ల ప్రభుత్వ రికార్డుల భద్రత దెబ్బతినడంతో పాటు కార్మికుల హక్కులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.గత కొంతకాలంగా హుజురాబాద్ కార్మిక కార్యాలయంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పటికీ సంబంధిత ఉన్నతాధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడం విచారకరమని ఆర్ఎల్డీ పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ పేర్కొంది. అక్రమాలకు పాల్పడిన వారిపై పారదర్శకంగా, నిష్పక్షపాత విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్‌ను కోరారు.కార్మిక శాఖలో అవినీతికి తావు లేకుండా పూర్తిస్థాయి పారదర్శక వ్యవస్థను అమలు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు.