
తేది:19-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: ఈరోజు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా ఎన్నుకోబడిన గ్రామపంచాయతీ సర్పంచుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు హాజరై, డిపిఓ, జెడ్పీ సీఈవో, డీఆర్‌డీఓ అధికారులతో కలిసి శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించి, సర్పంచులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ శిక్షణలో గ్రామపంచాయతీల విధులు, అధికారాలు, ప్రభుత్వ పథకాల అమలు విధానం, పారదర్శక పాలన, అభివృద్ధి పనుల ప్రణాళిక, ఆర్థిక నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ముఖ్యంగా గ్రామాల సమగ్ర అభివృద్ధికి సర్పంచులు నాయకత్వంతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ గారు సూచించారు.
ప్రజలతో నిత్యసంబంధం కొనసాగిస్తూ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు. అధికారుల సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా అధికారులు, శిక్షకులు, నూతన సర్పంచులు పెద్ద సంఖ్యలో పాల్గొని శిక్షణా అంశాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. గ్రామ పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పాల్గొన్న సర్పంచులు అభిప్రాయపడ్డారు.