న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా వడోదరలో జరిగిన టీమిండియా శిక్షణా శిబిరంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ యువ క్రికెటర్లతో కలిసి ముచ్చటిస్తూ, ఆటలో ఎదురయ్యే మానసిక సవాళ్లపై తన అనుభవాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ (BCCI) మంగళవారం సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది నెట్టింట వైరల్ అయింది. ముఖ్యంగా అవకాశాల కోసం ఎదురుచూసే క్రమంలో ఎదురయ్యే నిరాశను ఎలా అధిగమించాలో ఆయన వివరించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
శిక్షణలో ఉన్న ఒక యువ క్రికెటర్ “అవకాశాలు రాకపోతే ఏం చేయాలి?” అని అడిగిన ప్రశ్నకు రాహుల్ ఎంతో పరిణతితో సమాధానమిచ్చారు. “ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం కచ్చితంగా వస్తుంది. అది స్థానిక టోర్నీ కావొచ్చు లేదా అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చు.. ఆ క్షణం కోసం మీరు సిద్ధంగా ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని రెండు చేతులతో గట్టిగా అందిపుచ్చుకోవాలి. ఒక క్రికెటర్‌గా మన చేతుల్లో ఉండేది కష్టపడటం మాత్రమే” అని ఆయన హితవు పలికారు. నిరాశ కలిగించే దశ అందరికీ వస్తుందని, కానీ వాటి నుంచి త్వరగా బయటపడి మన పని మనం చేసుకుంటూ పోవాలని సూచించారు.
వడోదరలో జరిగిన తొలి వన్డేలో రాహుల్ తన అనుభవాన్ని చాటుతూ కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో హర్షిత్ రాణాతో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చి, అజేయంగా నిలిచారు. ప్రస్తుతం టీమిండియా 1-0 ఆధిక్యంలో ఉండగా, బుధవారం (జనవరి 14) రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. వాషింగ్టన్ సుందర్ గాయంతో దూరం కావడంతో ఆయుష్ బదోని జట్టులో చేరడం గమనార్హం.