పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘రాజాసాబ్’ సినిమా నిన్న (జనవరి 9, 2026) సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదలైంది. థియేటర్ల వద్ద ప్రభాస్ క్రేజ్‌తో సందడి కనిపిస్తున్నప్పటికీ, సినిమా ఫలితంపై భిన్నమైన టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ వింటేజ్ లుక్ మరియు ఓల్డ్ గెటప్ ఎపిసోడ్స్ ఆశించిన స్థాయిలో లేవని అభిమానులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన ‘బ్లాక్ బస్టర్ మీట్’లో దర్శకుడు మారుతి స్పందిస్తూ పలు కీలక విషయాలను పంచుకున్నారు.
మారుతి మాట్లాడుతూ.. సాధారణంగా 9 నెలల్లో సినిమా పూర్తి చేసే తాను, ప్రభాస్ కోసం ఈ ప్రాజెక్ట్ పై మూడేళ్లు శ్రమించానని తెలిపారు. ప్రభాస్‌ను ఒక సాధారణ కమర్షియల్ యాక్షన్ హీరోగా చూపించడం సులభమని, కానీ ఆయనను సరికొత్త కోణంలో ఆవిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ వైవిధ్యమైన పాయింట్‌ను ఎంచుకున్నట్లు చెప్పారు. కొత్తదనంతో కూడిన సినిమాలు ప్రేక్షకులకు ఎక్కడానికి కొంత సమయం పడుతుందని, కేవలం ఒక్క షోతోనే సినిమా రిజల్ట్‌ను డిసైడ్ చేయొద్దని ఆయన విన్నవించారు. క్లైమాక్స్ ఎపిసోడ్‌కు వస్తున్న స్పందన పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అభిమానుల కోరిక మేరకు సినిమాలో ఒక కీలక మార్పు చేసినట్లు మారుతి ప్రకటించారు. ప్రభాస్ ఓల్డ్ గెటప్ నిడివి తక్కువగా ఉందన్న ఫీడ్‌బ్యాక్ రావడంతో, కంటెంట్‌ను కాస్త ట్రిమ్ చేసి, ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన సీన్లను పెంచినట్లు వెల్లడించారు. ఈ కొత్త వెర్షన్ శనివారం (జనవరి 10) సాయంత్రం 6 గంటల షో నుండి థియేటర్లలో అందుబాటులోకి వస్తుందని, ఈ అదనపు సీన్లు అభిమానులను అలరిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తనలాంటి మిడ్ రేంజ్ దర్శకుడికి ఇంతటి భారీ అవకాశం ఇచ్చిన ప్రభాస్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.