వైద్య వృత్తి దైవకార్యం: నెలలో ఒక రోజు పల్లెలకు కేటాయించండి – వైద్యులకు పవన్ కళ్యాణ్ పిలుపు!

వైద్య వృత్తి కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదని, అది మానవత్వంతో కూడిన దైవ కార్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శనివారం కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో రూ.10.11 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని, వారు అందించే సేవలు నిరుపేదలకు ప్రాణదానంతో సమానమని కొనియాడారు.

వైద్యులు తమ వృత్తిపరమైన బాధ్యతలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక రోజైనా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సికిల్ సెల్ అనీమియా (Sickle Cell Anemia) వంటి వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లోని బాధితుల కోసం తన వంతుగా దాతల సహకారంతో అరకులో బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

రంగరాయ మెడికల్ కళాశాల చరిత్రను గుర్తు చేస్తూ, దాతల సహకారంతో ఏర్పడిన ఇటువంటి విద్యాసంస్థలు ప్రభుత్వ రంగంలో మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. చదువుకున్న కళాశాల పట్ల కృతజ్ఞతతో పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి భవన నిర్మాణం చేపట్టడం అభినందనీయమని ప్రశంసించారు. అనంతరం జిఎస్ఎల్ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం ఉచిత దంత చికిత్స అందించే మొబైల్ డెంటల్ స్క్రీనింగ్ వాహనాలను ఆయన ప్రారంభించి, రోగులకు డెంటల్ కిట్లను పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *