సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు షాకింగ్ వార్త చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,419 అద్దె బస్సులను ఈ నెల 12 నుండి నిలిపివేస్తున్నట్లు యజమానుల సంఘం ప్రకటించింది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే “స్త్రీ శక్తి” పథకం అమలులోకి వచ్చిన తర్వాత తమపై పడిన అదనపు ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
కూటమి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల బస్సుల నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని యజమానులు వాదిస్తున్నారు. ఒక్కో బస్సుకు నెలకు కనీసం రూ. 15,000 నుండి రూ. 20,000 వరకు అదనపు భారం పడుతుంటే, ఆర్టీసీ అధికారులు కేవలం రూ. 5,200 మాత్రమే చెల్లిస్తామని సర్క్యులర్ జారీ చేయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు సమ్మె నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
పండుగ వేళ ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే 6,000కు పైగా ప్రత్యేక బస్సులను అదనపు ఛార్జీలు లేకుండా ప్రకటించినప్పటికీ, ఈ 2,419 అద్దె బస్సులు నిలిచిపోతే ఆ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య ప్రయాణించే వారికి ఈ బస్సులు అత్యంత కీలకం. సంక్రాంతి రద్దీ సమయంలో ఈ సేవలు ఆగిపోతే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందని, తద్వారా అధిక ఛార్జీల భారం పడుతుందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.