నన్ను చంపండి.. ఇంత విషం ఇవ్వండి: మీడియా కథనాలపై మంత్రి కోమటిరెడ్డి భావోద్వేగం!

తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనపై మరియు మహిళా ఐఏఎస్ అధికారులపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, తనను మానసికంగా చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “నన్ను చంపాలంటే ఇంత విషం ఇచ్చి చంపండి, నాకు జీవితం మీద పెద్దగా ఆసక్తి లేదు” అంటూ అత్యంత భావోద్వేగంగా వ్యాఖ్యానించారు.

మహిళా అధికారుల పట్ల సోషల్ మీడియాలో వాడుతున్న భాష అత్యంత హేయంగా ఉందని మంత్రి మండిపడ్డారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన మహిళా అధికారులను ఉద్దేశించి అసభ్యకర వార్తలు రాయడం సరికాదని హితవు పలికారు. “మీడియా సోదరులకు కూడా ఇంట్లో అక్కాచెల్లెళ్లు ఉంటారు, మీ కుటుంబ సభ్యులపై ఇలాంటి వార్తలు వస్తే ఎలా ఉంటుంది?” అని ఆయన ప్రశ్నించారు. కలెక్టర్ హరిచందన వంటి సీనియర్ అధికారులను కూడా మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తన వ్యక్తిగత జీవితంలోని విషాదాన్ని గుర్తు చేసుకుంటూ, తన కుమారుడు చనిపోయినప్పుడే తాను సగం చచ్చిపోయానని, ప్రస్తుతం దేవుడిని నమ్ముకుని సేవ చేస్తున్నానని కోమటిరెడ్డి తెలిపారు. అధికారుల బదిలీలు ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలని, వాటికి తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే డీజీపీతో మాట్లాడి విచారణకు ఆదేశించానని, 20 రోజుల్లో నిజానిజాలు బయటకు వస్తాయని, తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *