రాజకీయాల్లో పారదర్శకతను పెంచేందుకు, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగానే, తెలంగాణలోని గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలు (RUPPs) తమ ఆదాయ-వ్యయాల వివరాలను వెల్లడించడంలో నిర్లక్ష్యం వహిస్తుండటంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి సీరియస్ అయ్యారు. చట్టబద్ధమైన గడువుల లోపు నివేదికలు ఇవ్వని పార్టీలపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు.
ఆయా పార్టీలు తమ వార్షిక ఆర్థిక నివేదికలను నిర్ణీత గడువులోగా సమర్పించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని శుక్రవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ పారదర్శకత నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చిన విరాళాల వివరాలను అక్టోబర్ 31వ తేదీలోపు ఎన్నికల కమిషన్‌కు నివేదించాల్సి ఉంటుంది. అలాగే, ఆడిట్ చేసిన వార్షిక ఖాతాలను ఆదాయపన్ను (IT) రిటర్న్స్ గడువు ముగిసిన నెల రోజుల్లోపు అందజేయాలని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ఖర్చులకు సంబంధించి, అసెంబ్లీ ఎన్నికల పూర్తయిన 75 రోజుల్లోపు, లోక్‌సభ ఎన్నికల తర్వాత 90 రోజుల్లోపు నివేదికలు సమర్పించడం తప్పనిసరి అని గుర్తుచేశారు.
ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29సీ ప్రకారం ఈ నివేదికలు సమర్పించిన పార్టీలకే ఆదాయపన్ను మినహాయింపులు లభిస్తాయని ఆయన వివరించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే విరాళాల నివేదికలను ఎలాంటి ప్రయోజనాల కోసం పరిగణనలోకి తీసుకోబోమని సెక్షన్ 29సీ(3)ని ఉటంకిస్తూ స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక పార్టీలు నివేదికలు సమర్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని, ఈ ధోరణి వీడకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీఈఓ హెచ్చరించారు.
కేంద్ర ఎన్నికల సంఘం (ECI) రాజకీయ పార్టీల ఆర్థిక నివేదికల సమర్పణ ప్రక్రియను సులభతరం చేసేందుకు IEMS (Integrated Election Expenditure Monitoring System) అనే ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. రాజకీయ పార్టీలు తమ విరాళాల నివేదికలు, వార్షిక ఆడిట్ ఖాతాలు మరియు ఎన్నికల ఖర్చుల వివరాలను ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ https://iems.eci.gov.in/ నమోదు చేయాల్సి ఉంటుంది.