తెలంగాణలో గొర్రె, మేకల రక్తం మాఫియా ..!

తెలంగాణలో నగరంలోని గొర్రె, మేకల రక్తం మాఫియా వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లా కీసరలో బతికున్న గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి.. 180 రక్తం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఒక నకిలీ వెటర్నరీ డాక్టర్, మటన్ షాపు యజమాని కలిసి ఈ దందా నడిపిస్తున్నట్లు తేలింది. అంతేకాదు..కాచిగూడాలోని సీఎన్‌కే ఇంపోర్ట్ ఎక్స్‌పోర్టు కంపెనీపై దాడులు చేసి1000 లీటర్ల రక్తాన్ని సంబంధించిన ప్యాకెట్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్‌ చేశారు.

 

ఫార్మా కంపెనీలు సీరం తయారీ కోసం జంతువుల రక్తాన్ని వాడుతుంటాయి. వివిధ రకాల మెడిసిన్స్, వ్యాక్సిన్లు, డయాగ్నోస్టిక్ కిట్స్ తయారీలో.. రక్తం నుండి వేరు చేసిన సీరంను ఉపయోగిస్తాయి. మెడికల్ రంగంలో, ముఖ్యంగా మైక్రోబయాలజీ విభాగంలో గొర్రె రక్తం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. దీనిని ముఖ్యంగా బ్లడ్ అగర్ టెస్ట్ అనే ప్రత్యేక పరీక్షలో గొర్రె రక్తాన్ని ఉపయోగిస్తారు. ఈ పరీక్ష ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా ఎలాంటి ప్రభావం చూపుతోందో, రక్తకణాలను ఎలా దెబ్బతీస్తుందో పరిశీలిస్తారు. దాని ఆధారంగా ఏ యాంటీబయాటిక్ మందు సరైనదో వైద్యులు నిర్ణయిస్తారు.అదేవిధంగా పాము కాటు చికిత్సలో ఉపయోగించే యాంటీవెనమ్ తయారీలో కూడా గొర్రె రక్తానికి ప్రత్యేక స్థానం ఉంది.ఈ ఔషధం వేలాది పాము కాటు బాధితుల ప్రాణాలను కాపాడుతోంది అని నిపుణులు చెబుతున్నారు.

 

ఔషధాల తయారీ కోసం గొర్రెలు, మేకల నుంచి రక్తాన్ని సేకరించే ప్రక్రియలో.. ఖచ్చితమైన నిబంధనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు వెటర్నరీ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ హకీమ్. మూగజీవాల నుంచి ఇష్టానుసారంగా రక్తం తీయడం నేరమని తెలిపారు. దీనికి సంబంధించి 2009 యానిమల్ వెల్ఫేర్ యాక్ట్ గైడ్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ట్రెయిన్డ్, ప్రొఫెషనల్ వెటర్నరీ డాక్టర్ సమక్షంలోనే రక్తం సేకరించాలని అంటున్నారు. యానిమల్ బాడీలో ఉన్న మొత్తం బ్లడ్‌లో 10శాతం మాత్రమే కలెక్ట్ చేయాలన్నారు. ఒక సారి రక్తం సేకరించిన తర్వాత మళ్లీ కలెక్ట్ చేయాలంటే.. 15 రోజుల గ్యాప్ ఉండాలని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *