తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్య వైభవాన్ని చాటిచెప్పే ‘అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్ 2026’ ఘనంగా ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా ఏపీ ఆవకాయ్ ఫెస్టివల్ 2026ను మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నాయి. విజయవాడ కృష్ణా నది తీరంలోని పున్నమి ఘాట్, భవానీ ద్వీపం వేదికగా ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవం తెలుగు వారి ఆహార, సినిమా, సాహిత్య, కళా వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా
పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రధాన వేదికపై సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బొమ్మలాటలు, డ్రమ్స్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టూరిజంశాఖ మంత్రి కందుల దుర్గేష్, యూరోపియన్ యూనియన్ అంబాసిడర్ హెర్వే డెల్ఫిన్, పలువురు ప్రముఖులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
లైవ్ కన్సర్ట్ ప్రత్యేక ఆకర్షణ
ప్రముఖ సింగర్ జావేద్ అలీ లైవ్ కచేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రేపు పలు నాటక ప్రదర్శనలు, సాహిత్య చర్చలు ఉంటాయి. ప్రముఖ రచయితలు, చిత్ర నిర్మాతలు తెలుగు సినిమా-సాహిత్యం మధ్య ఉన్న అనుబంధంపై చర్చిస్తారు. యువ కళాకారుల కోసం వర్క్‌షాప్‌లు కూడా సిద్ధం చేశారు. ఎల్లుండి కృష్ణా నదిలో ఘాట్ ఫెర్రీ ప్రయాణాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఫెస్టివల్ ముగుస్తుంది. ముగింపు వేడుకల్లో భాగంగా మరో భారీ సంగీత కచేరీ ప్లాన్ చేశారు.
సాంస్కృతిక కేంద్రంగా అమరావతి
ఆవకాయ్ ఎంత స్పైసీగా, వైబ్రంట్‌గా ఉంటుందో.. మన కళలు కూడా అంతే శక్తివంతమైనవని చెప్పడానికి ఈ పేరుతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అమరావతిని సాంస్కృతిక కేంద్రంగా మార్చే వ్యూహంలో భాగంగానే ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా స్థానిక ఆహార పదార్థాలు, హస్తకళలను ప్రోత్సహిస్తున్నారు. పర్యాటకుల రద్దీ దృష్ట్యా విజయవాడ పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా విజయవాడ వాసులకు, పర్యాటకులకు ఈ మూడు రోజులు ఆవకాయ్ ఫెస్టివల్ మధురమైన సాంస్కృతిక అనుభూతిని అందించనుంది.