ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ విషం చిమ్మడం మొదలుపెట్టిందా? మళ్లీ అవే మాటలు జగన్ స్టార్ట్ చేశారా? వైసీపీ ఎత్తుగడలను ముందుగానే సీఎం చంద్రబాబు పసి గట్టారా? అందుకే బుధవారం ఢిల్లీ అమరావతి వ్యవహారాన్ని పూర్తి చేశారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
అమరావతిపై వైసీపీ వ్యవహారశైలిని ముందుగా పసిగట్టారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించేలా చూడాలని సూచన చేశారు. అందుకు కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి.
సీఎం చంద్రబాబు అడుగులను నిశితంగా గమనిస్తున్నారు మాజీ సీఎం జగన్. గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశం తర్వాత సెలక్టివ్‌గా పలు నేషనల్ ఛానెళ్ల ప్రతినిధులతో ప్రత్యేకంగా రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నదీ గర్బంలో అమరావతి కడుతున్నారని, ఈ విషయంలో సుప్రీంకోర్టు పరిశీలన చేయాలని వ్యాఖ్యానించారు.
ప్రపంచంలో అమరావతి బెస్ట్ సిటీ అవుతుందని వెల్లడి
అంతేకాదు రాజధాని అనే పదం రాజ్యంగంలో లేదని తేల్చిచెప్పారు. ఇదిలావుండగా గురువారం రాత్రి విజయవాడలో ‘అమరావతి-ఆవకాయ ఫెస్టివల్-2026’ కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. పున్నమి ఘాట్‌లో మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు, రాజధాని అమరావతిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎవరెంత బాధపడినా అమరావతి ఫ్యూచర్ సిటీ అని, ప్రపంచంలోనే బెస్ట్ సిటీ అవుతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి డైనమిక్ సిటీ ఎక్కడా ఉండదన్నారు.
రాజధాని అమరావతి కృష్ణానది తీరంలో ఒక గంట కూర్చుంటే మెడిటేషన్ కూడా అవసరం లేదని తేల్చేశారు. అమరావతి గ్రీన్ సిటీ, విజయవాడ క్లీన్ సిటీ అవుతుందన్నారు. ఎక్కడ చెట్లు కట్ చేసే పరిస్థితి లేదన్నారు. రోడ్లు కట్ పరిస్థితి అస్సలు రాదన్నారు. నిర్మాణం కోసం కొత్త టెక్నాలజీని వాడుతున్నట్లు చెప్పారు.
జగన్ చేసిన వ్యాఖ్యలపై నేరుగా మాట్లాడకుండా రాజధాని, నదీ తీరం గురించి వివరించారు ముఖ్యమంత్రి. ఒకప్పుడు దసరా అంటే మైసూర్, కోల్‌కతా పేర్లు గుర్తుకు వచ్చేవని, ఇప్పుడు విజయవాడ వినిపించేలా చేశామన్నారు. అదే సమయంలో ఆవకాయ వంటకం, దాని ఖ్యాతి గురించి కొన్ని విషయాలు బయటపెట్టారు. రాజధాని వ్యవహారంలో జరుగుతున్న రచ్చపై మాట్లాడేందుకు వైసీపీ నేతలు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.