జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతికి రానున్నారు. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలోఆయన పార్టీ శ్రేణులకు కీలక దిశా నిర్దేశం చెయ్యనున్నారు. ఏపీలో జగన్ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల్లో జగన్ ఓటమి కోసం ఆయన ఈసారి గట్టిగానే ఫోకస్ పెట్టారు.
ఇటీవల తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో బీజేపీతో కలిసి తెలంగాణాలోనూ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన పార్టీ, అలాగే మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం సాగించిన జనసేనాని మళ్ళీ ఏపీ రాజకీయాలపై ఫోకస్ చెయ్యనున్నారు. ఏపీలోనూ త్వరలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తున్న పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో తగిలిన దెబ్బ ఈ ఎన్నికల్లో తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అందుకే ఈ దఫా ఎన్నికల్లో పొత్తులను ముందే ప్రకటించిన పవన్ కళ్యాణ్ టీడీపీ తో కలిసి ప్రయాణం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ మంత్రులు, నేతలు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ నిత్యం టార్గెట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ మాత్రం వెనకడుగు వెయ్యటం లేదు.
ఏపీలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్ నేడు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎన్నికలకు పార్టీ నాయకులను, కేడర్ ను సమాయత్తం చెయ్యటంతో పాటు, క్షేత్ర స్థాయిలో టీడీపీతో సమన్వయం చేసుకోవటంపై ప్రధానంగా చర్చించనున్నారు.
ఈ నెల రెండో వారం నుండి టీడీపీ తో కలిసి చెయ్యనున్న వివిధ కార్యక్రమాల రూపకల్పనపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాదు ఓటర్ల జాబితాల పరిశీలన పై కూడా నేడు పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. ఈసారి ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించటం టార్గెట్ గా పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.