తేది:8-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా టేక్మల్ మండల రిపోర్టర్ రొడ్డ సాయిలు.
మెదక్ జిల్లా: టేక్మాల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలును టేక్మాల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తిమ్మి గారి సుధాకర్ గారు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం చేసి, భోజనం రుచికరంగా ఉందా, మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా, ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన సర్పంచ్ గారు, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే భోజనం అందించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. భోజనం విషయంలో లేదా పాఠశాల వసతులపై ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సుధాకర్ గారు, ఉదయం వేళల్లో చల్లని నీళ్లకు బదులు వేడి నీళ్లతో స్నానం చేయాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యతో పాటు ఆరోగ్యమే ముఖ్యమని, మంచి ఆరోగ్యం ఉంటేనే చదువులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ మజహర్, మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, మాజీ సొసైటీ డైరెక్టర్ ఆశల సాగర్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్, అంబెష్, కాంతం, శివశంకర్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు.
పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం పట్ల తమ పూర్తి సహకారం ఉంటుందని నాయకులు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.