తేది:07-01-2026 నల్గొండ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ వనమాల రమేష్.
నల్గొండ జిల్లా,దేవరకొండ: నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి మండల కేంద్రంలోని అత్యంత కీలకమైన ‘X’ రోడ్డు కూడలిలో నెలకొల్పిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం రక్షణ గోడను తక్షణమే అదే ప్లేస్ లో పునర్నిర్మించాలని దేవరకొండ నియోజకవర్గ వివిధ దళిత, ప్రజా, సామాజిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం రోజున దేవరకొండ నియోజకవర్గంలోని వివిధ కుల, ప్రజా మరియు సామాజిక సంఘాల నాయకుల బృందం, జాతీయ రహదారుల సంస్థ (NHAI) డివిజనల్ ఇంజనీర్ (DE)కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత నెలలో కొండ మల్లేపల్లి జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహం చుట్టూ జాతీయ రహదారుల సంస్థ అధికారిక మార్కింగ్ ప్రకారంగా ఉన్న ప్రహరీ గోడను తొలగించారని గుర్తు చేశారు. అయితే, గోడను తొలగించి చాలా కాలం గడుస్తున్నా, అధికారులు తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించకపోవడం వల్ల విగ్రహం భద్రత లేని స్థితిలో ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. NHAI నిబంధనల ప్రకారం, గతంలో ఏ స్థలంలో అయితే రక్షణప్రహరీ గోడ ఉండేదో, అదే విధంగా పటిష్టమైన ప్రహరీ గోడను అదే స్థానంలో పునర్నిర్మించాలని వారు స్పష్టం చేశారు.
కేవలం గోడ నిర్మించడమే కాకుండా, విగ్రహం చుట్టూ ఉన్న పరిసరాలను సుందరీకరించాలని అధికారులను కోరారు. విగ్రహం చుట్టూ సుందరీకరణను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని గౌరవప్రదంగా తీర్చిదిద్దాలని విన్నవించారు. లక్షలాది మందికి ఆదర్శప్రాయుడైన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద రక్షణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సామాజిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు , ప్రజా సంఘాల నాయకులు, మాల మహానాడు నాయకులు సామాజిక సంఘాల నాయకులు, కార్యకర్తలు మరియు అంబేద్కర్ అనుచరులు తదితరులు పాల్గొన్నారు.