రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడులు నిర్వహించి ముగ్గురు ప్రభుత్వ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నందిగామ ఎంపీడీవో సుమతి, ఏపీవో తేజ్ సింగ్, మరియు ఈదులపల్లి గ్రామ కార్యదర్శి చెన్నయ్య ఒక వ్యక్తి నుండి లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం వారిని అదుపులోకి తీసుకుంది. భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతుల విషయంలో ఈ ముగ్గురు అధికారులు కలిసి అవినీతికి పాల్పడినట్లు తేలింది.
ఈదులపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి ప్రవీణ్ అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి అనుమతి కోరగా, ఈ అధికారులు ఏకంగా రూ. 3.5 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు గతంలోనే ఒక లక్ష రూపాయలు చెల్లించినప్పటికీ, మిగిలిన సొమ్ము కోసం అధికారులు ఒత్తిడి చేయడంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో రెండో విడతగా మరో లక్ష రూపాయలు లంచం ఇస్తుండగా అధికారులు దాడులు చేసి వారిని బంధించారు.
ప్రస్తుతం ఏసీబీ అధికారులు నందిగామ ఎంపీడీవో కార్యాలయంలో సోదాలు కొనసాగిస్తూ, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల చేతులపై రసాయన పరీక్షలు నిర్వహించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించారు. పట్టుబడిన ముగ్గురు అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదని ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు హెచ్చరించారు.