తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన కల్వకుంట్ల కవిత రాజీనామా మరియు ఆమె కొత్త పార్టీ ఏర్పాటుపై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. కవిత తన వద్దకు వచ్చి వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేయడం వల్లే ఆమె ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను ఆమోదించినట్లు ఆయన వెల్లడించారు. సాధారణంగా ఎవరైనా భావోద్వేగంతో రాజీనామా చేసినప్పుడు కొంతకాలం వేచి చూస్తామని, కవిత విషయంలో కూడా అదే పద్ధతిని అనుసరించినట్లు ఆయన వివరించారు.
కవిత కొత్త పార్టీని స్థాపించనున్నట్లు చేసిన ప్రకటనపై గుత్తా తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీలు పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ కొత్త పార్టీలు వచ్చినా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అవి మనుగడ సాగించడం చాలా కష్టమని పేర్కొన్నారు. గతంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయని, కానీ కాలక్రమేణా అవి కనుమరుగయ్యాయని ఆయన గుర్తు చేశారు.
రాజకీయ అంశాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. అలాగే, ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు. హిల్ట్ పాలసీ వల్ల ఎవరికీ నష్టం జరగదని, పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ద్వారా కాలుష్య నివారణకు ప్రభుత్వం కృషి చేస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.