యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లో ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంక్‌ల విలీనం (అమాల్గమేషన్) తర్వాత దేశంలో ఐదో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌గా యూబీఐ అవతరించిందని ఎండీ అండ్ సీఈఓ రాజ్‌కిరణ్ రాయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం యూబీఐకు దేశవ్యాప్తంగా 9,500 బ్రాంచీలు, 13,500 ఏటీఎంలు, 120 మిలియన్ల మంది కస్టమర్లున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంక్‌ల వినియోగదారులు తమ డెబిట్ కార్డ్‌లను యూబీఐ ఏటీఎంలలో వినియోగించినా సరే ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. కస్టమర్ల ఖాతా నంబరు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ పోర్టల్స్‌లో ఎలాం టి మార్పులు ఉండవని.. గతంలో మాదిరిగానే వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. నగదు ఉపసంహరణ, నిల్వ, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి బేసిక్ సర్వీస్‌లను మూడింట్లో ఏ బ్యాంక్‌లోనైనా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.