వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో తొలిసారి హాజరయ్యారు. కోర్టులో సిలియా ఫ్లోరెస్ పరిస్థితి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె నుదుటిపై మరియు కుడి కణత వద్ద బ్యాండేజీలతో, ముఖంపై గాయాలతో కనిపించారు. అమెరికా దళాలు జరిపిన మెరుపు దాడిలో (కిడ్నాప్ సమయంలో) ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని, కనీసం కూర్చోవడానికి కూడా ఆమెకు ఇతరుల సహాయం అవసరమైందని ఆమె న్యాయవాది మార్క్ డోనెల్లీ కోర్టుకు తెలిపారు.
ఆమె పక్కటెముక విరిగి ఉండవచ్చని లేదా తీవ్రమైన రక్తగాయాలు అయ్యి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ, ఆమెకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు (X-ray) నిర్వహించాలని న్యాయవాది డిమాండ్ చేశారు. నికోలస్ మదురో కూడా తాను నిర్దోషినని, తనను అక్రమంగా కిడ్నాప్ చేశారని న్యాయమూర్తి అల్విన్ హెలర్స్టెయిన్ ఎదుట వాదించారు. “నేను నా దేశానికి అధ్యక్షుడిని, ఇక్కడ యుద్ధ ఖైదీగా ఉన్నాను” అని మదురో ఆవేదన వ్యక్తం చేశారు.
CNN మరియు ఇతర అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం, జనవరి 3, 2026 తెల్లవారుజామున అమెరికా దళాలు కరాకస్‌లోని మదురో నివాసంపై మెరుపు దాడి చేశాయి. గాలిపటాల వంటి తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలు, బాంబు దాడుల మధ్య అమెరికా ప్రత్యేక దళాలు (Delta Force) మదురో దంపతులను వారి బెడ్రూమ్ నుంచే బలవంతంగా లాక్కొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దంపతులపై నార్కో-టెర్రరిజం, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వీరి తదుపరి విచారణను కోర్టు మార్చి 17, 2026కు వాయిదా వేసింది.