
తేది:06- 01-2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: సూరారం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారెడ్డి హాస్పిటల్ ఎదురుగా శనివారం సాయంత్రం ఒక ప్రమాదం తప్పింది. గండి మైసమ్మ నుంచి బాలానగర్ వైపు వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం నుండి అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడటంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
సాయంత్రం వేళలో గండి మైసమ్మ–బాలానగర్ రహదారి ఎప్పుడూ తీవ్ర ట్రాఫిక్‌తో నిండిపోయి ఉంటుంది. అలాంటి సమయంలో ద్విచక్ర వాహనం నుండి మంటలు రావడంతో వాహనదారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ఈ ఘటనను గమనించిన జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ మార్షల్స్ మద్దూరి ప్రశాంత్, కట్టేబోయిన శివకుమార్ యాదవ్, కొమ్ము విక్రం వెంటనే అప్రమత్తమయ్యారు. సమయాన్ని వృథా చేయకుండా పక్కనే ఉన్న భారత్ పెట్రోల్ బంక్ నుంచి భద్రతా చర్యల కోసం ఉపయోగించే నైట్రోజన్ సిలిండర్ తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
వారి సమయస్ఫూర్తి వల్ల పెను ప్రమాదం తప్పింది. మంటలు పూర్తిగా ఆర్పివేయడంతో అక్కడున్న వాహనదారులంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ మార్షల్స్ చేసిన ఈ సాహసోపేతమైన చర్యకు స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
ప్రమాద సమయంలో చూపిన ధైర్యం, బాధ్యతాభావం, మానవత్వం జీడిమెట్ల ట్రాఫిక్ మార్షల్స్ సేవలకు అద్దం పడుతోందని పలువురు ప్రశంసించారు.