తేది:5- 1- 2026 TSLAWNEWS సంగారెడ్డి, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.
సంగారెడ్డి జిల్లా: సింగూర్ డ్యాం మరమ్మత్తుల నేపథ్యంలో ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
సింగూర్ డ్యాం మరమ్మత్తులలో భాగంగా సింగూర్ జలాశయం నుండి నీటిని 517.5 లెవెల్ వరకు ఖాళీ చేయనున్న నేపథ్యంలో ఏర్పడే పరిణామాలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, తాగునీటిపై ప్రభావం చూపే గ్రామాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, నీటిని వదలడంతో ప్రభావితమయ్యే ఇంటెక్ వెల్స్ వివరాలు, బల్క్ నీటి సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాలు, సింగూర్ కింద ఉన్న ఆయకట్టు ప్రాంతాలు, ఆయా ప్రాంతాల రైతులకు ముందస్తు సమాచారం అందించే అంశాలపై సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ నీటిపారుదల, మిషన్ భగీరథ, హెచ్‌ఎండబ్ల్యూఎస్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఎస్.ఈ. రఘునాథ్ రావు మాట్లాడుతూ, సింగూర్ జలాశయం నుండి 517.5 లెవెల్ వరకు సుమారు 40 రోజులపాటు దశలవారీగా (ఫేస్డ్ మేనర్) పవర్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయినప్పటికీ జలాశయంలో 8.17 టీఎంసీల నీటి నిల్వ మిగులుతుందని, అందులో సుమారు 8 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించవచ్చని కలెక్టర్‌కు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సింగూర్ నీటిని 517.5 లెవెల్ వరకు ఖాళీ చేయనున్న నేపథ్యంలో మిగిలిన 8.17 టీఎంసీల నీటిని, ఎగ్జిస్టింగ్ సోర్స్‌ల ద్వారా ప్రజలకు తాగునీటి అవసరాలకు సరఫరా చేసేలా సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.డ్యాం మరమ్మత్తుల సమయంలో ఆయా గ్రామాల రైతులకు ముందస్తు సమాచారం తప్పనిసరిగా అందించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ కలెక్టర్ పాండు, మిషన్ భగీరథ ఎస్ ఈ రఘువీర్, ఈఈ లు, నీటిపారుదల శాఖ ఈఈ భీమ్, హెచ్ఎం డబ్ల్యూ ఎస్ అధికారులు పాల్గొన్నారు.