ఎక్కడో ఉందనుకుంటున్న వైరస్ ఇప్పుడు మన మధ్యలోకి వచ్చేసింది. జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జిల్లాకేంద్రానికి చెందిన సదరు వ్యక్తి మృతి చెందాడు. ఇక జిల్లా మరింత జాగ్రత్త పడాలి. అత్యవసరమైతే తప్ప ఇంటి గడప దాటొద్దు. నాలుగు రోజులపాటు జిల్లాలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నాం. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మహమ్మారిని కట్టడి చేసేందుకు జిల్లా వాసులు అందరూ సహకరించాలి..’ అంటూ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖి కోరారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో జిల్లాకేంద్రానికి చెందిన ఇసాక్ అలీ కరోనా లక్షణాలతో మృతిచెందినట్లు ఆయన ప్రకటించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిర్మల్ పట్టణానికి చెందిన సయ్యద్ ఇసాక్‌అలీ అనే వ్యక్తి బుధవారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్‌తో మరణించినట్లు కలెక్టర్ తెలిపారు. నిర్మల్ పట్టణాన్ని కరోనా ప్రభావిత జోన్‌గా గుర్తించి కరోనా వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు అమలు చేస్తున్నామన్నారు. వంద వైద్య బృందాలతో మూడు రోజులపాటు ఇంటింటా సర్వే నిర్వహించి 70వేల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నిర్మల్‌లో కరోనాను కంట్రోల్ చేయడానికి పలు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జోహ్రానగర్ వీధిని సీజ్ చేయడం జరిగిందన్నారు. మరణించిన వ్యక్తి ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి మార్చి 18న నిర్మల్‌కు తిరిగి రావడం జరిగిందన్నారు. అతను విమానయానం ద్వారా శంషాబాద్‌కు, అక్కడ నుంచి కారులో నిర్మల్‌కు చేరుకున్నాడని పేర్కొన్నారు. ఆయనతో36 మంది ప్రాథమిక పరిచయస్తులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.