తేది:5-1-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .
మెదక్ జిల్లా : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లింగాయపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు కఠినంగా చర్యలు చేపట్టారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి మొత్తం రూ.26,183 నగదును స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు పాపన్నపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించారు. ముందస్తు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, అక్రమంగా పేకాట సాగుతున్న ప్రదేశాన్ని చుట్టుముట్టి నిందితులను పట్టుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పేకాట, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు సమాజంలో నేరాలకు దారితీస్తాయని, ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమ కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా పోలీస్ శాఖ కోరింది.