
తేది:04-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు పట్టణం జాతీయ స్థాయి క్రీడలకు కేంద్రంగా ఎదుగుతున్నదానికి నిదర్శనంగా జీఎంఆర్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈ పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది బాడీ బిల్డర్లు హాజరై తమ శారీరక దారుడ్యం, క్రమశిక్షణ, ఫిట్‌నెస్‌ను అద్భుతంగా ప్రదర్శించారు.
ఈ జాతీయ స్థాయి పోటీలను పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మైదానమంతా క్రీడాభిమానులతో కిటకిటలాడుతూ పండుగ వాతావరణాన్ని తలపించింది. వివిధ విభాగాల్లో బాడీ బిల్డర్లు చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను ఉత్సాహభరితంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, క్రమశిక్షణ, నిరంతర వ్యాయామం, శారీరక దారుడ్యమే ఉన్నత విజయాలకు పునాది అని అన్నారు. యువత ఆరోగ్యవంతంగా ఎదగాలంటే క్రీడలు, ఫిట్‌నెస్‌ను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. స్థానిక యువతలో బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఇలాంటి జాతీయ స్థాయి పోటీలను పటాన్‌చెరులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బాడీ బిల్డర్లకు నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే రాబోయే నెలలో పటాన్‌చెరులో జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ పోటీలతో పటాన్‌చెరు పేరు దేశవ్యాప్తంగా క్రీడా వేదికగా వినిపిస్తోందని, భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి క్రీడా కార్యక్రమాలకు పటాన్‌చెరు కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని క్రీడాభిమానులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.