సుప్రీంలో ఓటు కు నోటు కేసు…

మరో సారి ఓటు కు నోటు కేసు తెర పైకి వచ్చింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..ఇదే సమయంలో తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు‌ కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసు తదుపరి విచారణ జనవరి రెండోవారానికి ధర్మాసం వాయిదా వేసింది. ప్రస్తుతం చంద్రబాబు సీఐడీ కేసుల్లో చిక్కుకున్న వేళ ఈ కేసు పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి.

 

ఏపీలో సీఐడీ వరుస కేసులతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇదే సమయంలో ఓటు కు నోటు కేసు సుప్రీంలో విచారణకు వచ్చింది. 2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీడీపీకి మద్దతు తెలపాలంటూ.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ మద్దతును రేవంత్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా రూ. 50 లక్షలు ఇచ్చేందుకు ఆయన నివాసానికి వచ్చారనే అభియోగంపై రేవంత్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. స్టీఫెన్‌సన్‌ను రేవంత్ రెడ్డి కలిసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలు శిక్షను అనుభవించారు, తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. అనంతర పరిణామాలతో ఈ కేసు మరుగున పడింది.

 

ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టులో రెండు పిటీషన్లు దాఖలు చేసారు. ఓటుకు కోట్లు కేసు తెలంగాణ ఏసీబీ రిపోర్టులో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఓటు కు నోటు కేసులో చంద్రబాబు పేరు చేర్చాలని తన పిటీషన్ లో న్యాయస్థానాన్ని అభ్యర్దించారు. చంద్రబాబు నాయుడిని నిందితుడిగా చేర్చడంలో ఏసీబీ విఫలమైందని వివరించారు. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని మరొక పిటిషన్ దాఖలు చేసారు. ఏసీబీ అసలు నిందితులను పట్టుకోవటంలో విఫలం అయిన కారణంగా ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని కోరారు. దీని పైన ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కాగా, సుప్రీం ద్విసభ్య ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణ జనవరి రెండోవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *