మహిళా ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకం-సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. సావిత్రిబాయి పూలే ఆశయాలు నెరవేర్చాలి-టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి.

తేది 3- 1- 2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్.

సంగారెడ్డి జిల్లా: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మహిళా ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులే రోల్ మోడల్ అని పేర్కొన్నారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని, మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని, వారి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణ
మన్నారు.జిల్లాలోని ఉపాధ్యాయుల్లో సుమారు 50 శాతం మహిళా ఉపాధ్యాయులే ఉన్నారని, విద్యా వ్యవస్థలో మహిళా ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. సావిత్రిబాయి పూలే స్థాపించిన తొలి పాఠశాల వల్లనే నేడు మహిళలు విద్యావంతులై వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. యువతలో వ్యసనాలను రూపు
మాపేందుకుఉపాధ్యాయులు సమాజానికి దిశానిర్దేశం చేయాలనిపిలుపునిచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడంతో పాటు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యా
యులు కృషి చేయాలని కోరారు. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ,మూఢనమ్మకాలు, దురాచారాలు రాజ్యమేలుతున్న కాలంలో ఎన్నో అవమానాలు, కష్టాలను ఎదుర్కొని సమాజ మార్పు కోసం సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే కృషి చేశారని అన్నారు. వారి అహర్నిశల సేవల ఫలితంగానే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారని పేర్కొన్నారు. సమాజాన్ని మార్చిన గొప్ప వనిత సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. పిల్లలకు కాలానుగుణంగా మంచి–చెడును బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని, మహిళల పట్ల సమాజంలో ఆలోచన ధోరణి మారాలని, సావిత్రిబాయి పూలే ఆశయాలను నెరవేర్చాలని కోరారు.
జిల్లాలో పూలే భవనానికి కేటాయించిన స్థలంలో భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పదిమంది మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్, టీజీఐఐసీ చైర్‌పర్సన్ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి గోవింద్ రామ్, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు బీరమ్య యాదవ్, యువజన సంఘాల అధ్యక్షుడు కూన వేణుగోపాల్, టీజీవో జిల్లా అధ్యక్షుడు వైద్యనాథ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు జావిద్ అలీ, బీసీ సంఘాల ప్రతినిధులు మల్లికార్జున్ పాటిల్, ప్రభు గౌడ్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *