పని కోసం మామ ఇంటినే కూల్చేశా: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు

భారతదేశ రహదారి మౌలిక సదుపాయాలను సమూలంగా మారుస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించారు. రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉందని తన సొంత మామగారి ఇంటినే కూల్చివేయించినట్లు ఆయన తెలిపారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ తన యూట్యూబ్ వ్లాగ్ కోసం ఢిల్లీలోని గడ్కరీ నివాసాన్ని సందర్శించినప్పుడు ఈ చర్చ సాగింది. గడ్కరీతో పాటు ఆయన భార్య కాంచన కూడా ఈ వ్లాగ్‌లో పాల్గొన్నారు.

ఈ సరదా సంభాషణలో భాగంగా.. రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో తన తండ్రి (గడ్కరీ మామగారు) ఇంటిని గడ్కరీ కూల్చివేశారని కాంచన గుర్తుచేశారు. ఆ సమయంలో ఫరా ఖాన్ ఆశ్చర్యపోతూ.. “మరి మీ మామకు కొత్త ఇల్లు కట్టించి ఇచ్చారా?” అని ప్రశ్నించగా, గడ్కరీ స్పందిస్తూ.. “అందరికీ ఎలాగైతే ప్రభుత్వం నుంచి పరిహారం అందుతుందో, ఆయనకు కూడా అలాగే అందేలా చూశాను” అని నవ్వుతూ చెప్పారు. అంటే, ఒక మంత్రిగా తన విధులను నిర్వహించే క్రమంలో బంధుత్వాలకు తావులేదని ఆయన ఈ సందర్భంగా నిరూపించారు.

ఈ వ్లాగ్‌లో ఫరా ఖాన్ తన కుక్ దిలీప్‌తో కలిసి గడ్కరీ నివాసంలో భోజనం చేస్తూ మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దిలీప్ తన గ్రామంలో రోడ్డు వేయాలని కోరగా, గడ్కరీ సానుకూలంగా స్పందించారు. నెటిజన్లు గడ్కరీ నిక్కచ్చిని, పారదర్శకతను మెచ్చుకుంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. దేశాభివృద్ధి కోసం సొంత మనుషులను సైతం పక్కనపెట్టిన ఆయన చిత్తశుద్ధిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *