బిర్లా టెంపుల్ లో కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుతో రేవంత్ రెడ్డి ప్రత్యేకపూజలు..!!

తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన ప్రచారానికి శుభం కార్డు పడింది. హోరాహోరీగా అన్ని పార్టీల నాయకులు ఎన్నికల కురుక్షేత్రంలో పోరాటం చేశారు. ఓటర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక ప్రస్తుతం సైలెంట్ పిరియడ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఓటరు తీర్పుపై అన్ని పార్టీల నాయకుల్లో ఉత్కంఠ కొనసాగుతుంది.

 

ఇంతకాలం తాము చేసిన ప్రచారం తమకు ఓటు బ్యాంకుగా మారుతుందా లేదా అన్నది అభ్యర్థుల టెన్షన్ కు కారణంగా మారింది. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న ముఖ్య నాయకులు ఆలయాల బాట పట్టారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం బిర్లా టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేశారు.

 

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల కార్డు వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు గాంధీభవన్ నుంచి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్ విహెచ్ పలువురు నేతలు బిర్లా టెంపుల్ కి వెళ్లడానికి బయలుదేరారు. అయితే వీరిని గాంధీభవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

 

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కేవలం ఐదుగురు మాత్రమే వెళ్లాలని రేవంత్ రెడ్డికి సూచించారు. ఇక దీంతో రేవంత్ రెడ్డి, ఠాక్రే, అంజన్ కుమార్, మల్లు రవి మాత్రమే బిర్లా ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నారు. బిర్లా టెంపుల్ లో దర్శనం చేసుకోవడంతోపాటు అనంతరం కాంగ్రెస్ నాయకులు నాంపల్లి దర్గా వద్ద కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

 

నాంపల్లి దర్గా వద్దకు వెళ్లిన వారిలో రేవంత్ రెడ్డి, మాణిక్ రావు ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, మల్లురవి, వి హనుమంతరావు, నరేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు, రేపు ఉదయం తెలంగాణ రాష్ట్రంలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, ఓటరు తీర్పు వెల్లడించనున్న క్రమంలో అభ్యర్థులు ఆలయాల బాట పట్టడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *