తెలంగాణా ఎన్నికల సమయంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణా ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులకు వివిధ కారణాలతో ఈసి నోటీసులు జారీ చేస్తుంది. ఇక తాజాగా ఒక కీలక నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థిపై పోలీస్ కేసు కూడా నమోదయ్యింది.
హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు అయింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపాయి. నిన్న పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా చేసిన భావోద్వేగ వ్యాఖ్యల పైన కమలాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు.
A case filed against BRS MLA candidate Padi Kaushik Reddy in Kamalapur Police Station
ఇక పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ఇప్పటికే కేంద్రం ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించి, ఆయన వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, ఎన్నికల అధికారులను ఆదేశించింది. నిన్న జరిగిన ప్రచారంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఓటర్లను ఉద్దేశించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
“మీకు దండం పెడతా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. నేను చేయాల్సిన ప్రచారం చేశా” అని పేర్కొన్న ఆయన తనను సాదుకుంటారో.. చంపుకుంటారో మీ ఇష్టం అంటూ ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఓట్లు వేసి గెలిపిస్తే 4వ తారీఖున విజయయాత్రకు వస్తానని, లేకపోతే నా శవయాత్రకు మీరు రండి అని.. కానీ ఏ యాత్ర చేయాలి అనేది ఓటర్లే నిర్ణయించాలని పాడి కౌశిక్ రెడ్డి ఉద్వేగంగా మాట్లాడారు.
అయితే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఓటర్లకు బ్లాక్మెయిలింగ్ వ్యాఖ్యలని, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈసీ దృష్టి సారించి పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇక మరో వైపు కమలాపూర్ ఎంపీడీవో ఫిర్యాదు మేరకు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని,ఆయనపై ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు.