ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నప్పటికీ, తన వల్ల ఏ నిర్మాత ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన సినిమాలకు స్వస్తి చెబుతారని అందరూ భావించినా, తాజాగా కొత్త ఏడాది సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డితో సినిమా చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ వార్తతో పవన్ రాజకీయాల్లో కొనసాగుతూనే బాధ్యతాయుతమైన కథాంశాలతో సినిమాలు చేస్తారని స్పష్టమైంది.
దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఒక పొలిటికల్ డ్రామాగా రూపొందించనున్నారు. కేవలం యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా, సమాజంలో రాజకీయ నాయకులు ఎలా ఉండాలి? ప్రజల బాధ్యత ఏమిటి? వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తే సమాజం బాగుపడుతుంది? అనే బలమైన సామాజిక అంశాలను ఈ సినిమాలో చర్చించబోతున్నారు. పవన్ కళ్యాణ్ వాస్తవ రాజకీయ ప్రయాణానికి దగ్గరగా ఈ పాత్ర ఉండబోతుందని సమాచారం.
ఈ సినిమా ప్రకటనతో జనసేన శ్రేణుల్లోనూ, సినిమా అభిమానుల్లోనూ ఉత్సాహం నెలకొంది. గతంలో సురేందర్ రెడ్డి ‘ధ్రువ’, ‘రేసుగుర్రం’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించడంతో, పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ పొలిటికల్ డ్రామాను ఎలా తీర్చిదిద్దుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ మరియు ఇతర నటీనటుల వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.