2020 అక్టోబర్ 28న కొండగట్టు సమీపంలోని మంజునాథ ఆలయ కుటీరంలో ఈ ఘోరం జరిగింది. హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన పవన్ కుమార్, తన భార్య కృష్ణవేణితో కలిసి తన బావమరిది జగన్ మృతిని పరామర్శించడానికి జగిత్యాలకు వచ్చారు. అయితే, జగన్ అనారోగ్యంతో మరణించడానికి పవన్ కుమార్ చేసిన ‘చేతబడి’ కారణమని అతని బంధువులు అనుమానించారు. ఈ నేపథ్యంలో, పవన్ కుమార్‌ను ఒక కుటీరంలో బంధించిన నిందితులు, అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో పవన్ కుమార్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.
పోలీసుల దర్యాప్తులో ఈ హత్య వెనుక పవన్ కుమార్ భార్య కృష్ణవేణి కీలక పాత్ర పోషించినట్లు తేలింది. జగన్ మరణంపై అనుమానంతో పాటు, కుటుంబ వివాదాలు కూడా ఈ హత్యకు కారణంగా నిలిచాయని దర్యాప్తులో వెల్లడైంది. పక్కా ప్రణాళికతోనే పవన్ కుమార్‌ను జగిత్యాలకు పిలిపించి, ఇతర మహిళా బంధువులతో కలిసి కృష్ణవేణి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆరుగురు మహిళలను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అప్పట్లో చార్జిషీట్ దాఖలు చేశారు.
కేసును సుదీర్ఘంగా విచారించిన జగిత్యాల మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి, సాక్ష్యాధారాలను పరిశీలించి నిందితుల నేరం రుజువైనట్లు నిర్ధారించారు. ఆరుగురు నిందితులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు. చేతబడి అనుమానంతో ఒక విద్యావంతుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అత్యంత కిరాతకంగా చంపిన ఈ కేసులో ఐదేళ్ల తర్వాత న్యాయం జరగడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.