తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలి.. దొరల గడీల పాలన పోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కొడంగల్ తనకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందంటూ ఈ నియోజకవర్గంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కొడంగల్ ను దత్తత తీసుకుంటానని గతంలో కేటీఆర్ చెప్పి మోసం చేశారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణను కొడంగల్ నియోజకవర్గమే దత్తత తీసుకుంటుందన్నారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు. తాను మాత్రం ఇందిరమ్మ రాజ్యంలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని మాట ఇచ్చారు. లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ కు చర్లపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కడతానన్నారు.
తెలంగాణలో మార్పురావాలని రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి.. దొరల గడీల పాలన పోవాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ వల్ల మోసం పోయిన 30 లక్షల నిరుద్యోగులు కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు పనిచేయాలన్నారు.
కొడంగల్ లో కాంగ్రెస్ విజయభేరి సభ జనసంద్రాన్ని తలపించింది. భారీ జనం పోటెత్తారు.తన ప్రసంగం చివరిలో.. “మార్పుకావాలి..కాంగ్రెస్ రావాలి” అని ప్రజలతో రేవంత్ చెప్పించారు. ఆ సమయంలో సభా ప్రాంగణం దద్దరిల్లింది. బైబై కేసీఆర్ అంటూ సభకు హాజరైనవారితో చెప్పించారు.