మద్యం మత్తులో బీజేపీ నేత బీభత్సం: చలిమంట కాచుకుంటున్న వారిపైకి కారు దూసుకెళ్లి ఇద్దరు మృతి

మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో అధికార పార్టీ నేత మద్యం మత్తులో సృష్టించిన బీభత్సం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. పోర్సా ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున బీజేపీ యువజన విభాగం నేత దీపేంద్ర భదౌరియా తన కారుతో రోడ్డు పక్కన చలిమంట కాచుకుంటున్న వారిపైకి దూసుకెళ్లాడు. ఈ ఘోర ప్రమాదంలో 10 ఏళ్ల అర్నవ్ లక్షకర్ అనే బాలుడు, 65 ఏళ్ల రామ్ దత్ రాథోడ్ అనే వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.

అతివేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా జనంపైకి దూసుకురావడంతో అక్కడ ఉన్నవారు గాల్లోకి ఎగిరి పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు నిందితుడు దీపేంద్రను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే, పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడు కొద్దిసేపటికే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడం తీవ్ర కలకలం రేపింది. అధికార పార్టీ నేత కావడంతో పోలీసులు కావాలనే అతడిని తప్పించారని ఆరోపిస్తూ బాధితుల బంధువులు, స్థానికులు రోడ్డుపై బైఠాయించి భారీ నిరసన చేపట్టారు.

ఈ ఘటనతో పోర్సా-జోటై రహదారిపై ఉద్రిక్తత చోటుచేసుకోగా, పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి నిరసనకారులకు నచ్చజెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో గంటల తరబడి సాగిన ఆందోళన విరమించారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికార మదంతో అమాయకుల ప్రాణాలు తీసిన నేత తీరుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *