రేణుక, దీప్తి దెబ్బకు శ్రీలంక విలవిల: భారత్ ముందు 113 పరుగుల స్వల్ప లక్ష్యం!

భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్ ఎంచుకోగా, భారత బౌలర్లు ఆరంభం నుంచే లంక బ్యాటర్లను వణికించారు. ముఖ్యంగా పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్, స్పిన్నర్ దీప్తి శర్మ ధాటికి లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది.

భారత బౌలర్లలో రేణుకా సింగ్ అద్భుత స్పెల్‌తో ఆకట్టుకుంది. ఆమె 4 ఓవర్లలో కేవలం 21 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి శ్రీలంక టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసింది. మరోవైపు దీప్తి శర్మ కూడా తన స్పిన్ మాయాజాలంతో 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. వీరిద్దరి ధాటికి లంక ఇన్నింగ్స్‌లో ఇమేషా దులని (27), హసిని పెరీరా (25) మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. మిగిలిన వారంతా విఫలమవడంతో శ్రీలంక స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

అనంతరం 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు మిశ్రమ ఫలితం లభించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (1) త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ, మరో ఓపెనర్ షఫాలీ వర్మ దూకుడుగా ఆడుతోంది. తాజా సమాచారం ప్రకారం భారత్ ఒక వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. క్రీజులో షఫాలీ వర్మతో పాటు జెమీమా రోడ్రిగ్స్ ఉన్నారు. భారత జట్టు విజయం సాధించడానికి ఇంకా 86 పరుగులు చేయాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *