
తేది:26-12-2025 మెదక్ జిల్లా TSLAW NEWS మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం .
మెదక్ జిల్లా : మెదక్ పట్టణ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తీవ్రమైన చలిలో సరైన రక్షణ లేకుండా విధులు నిర్వహిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ పట్టణ కాంగ్రెస్ నాయకులు బొద్దుల కృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఉదయం 3 గంటల నుంచే పారిశుద్ధ్య కార్మికులు రహదారుల శుభ్రత, చెత్త తొలగింపు వంటి కీలక పనుల్లో నిమగ్నమై ఉంటారని, అయినప్పటికీ వారికి అవసరమైన చలికాల దుస్తులు, రక్షణ సామగ్రి అందించడం లో మున్సిపల్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
మున్సిపాలిటీలో పాలకవర్గం లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికుల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారిని విధుల్లోకి దించడమే తప్ప, వారి భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టణాన్ని శుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులను చిన్నచూపు చూడడం సరికాదని, వారి సేవలను గుర్తించి తక్షణమే నూతన యూనిఫాంలు, చలికాల దుస్తులు అందించాలని డిమాండ్ చేశారు.
లేనిచో సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి వినతిపత్రం అందజేస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.