ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్: ఇతర శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం!

విధుల్లో ఉండగా అనారోగ్య కారణాలతో మెడికల్ అన్‌ఫిట్ (Medically Unfit) గా మారిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ వెసులుబాటు కేవలం డ్రైవర్లకు మాత్రమే ఉండగా, ఇప్పుడు కండక్టర్లతో సహా 21 కేటగిరీల ఉద్యోగులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా 2020 జనవరి 1న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత అనారోగ్యానికి గురై ఉద్యోగాలకు దూరమైన వేలాది కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్ద భరోసాగా నిలిచింది.

మెడికల్ అన్‌ఫిట్ అయిన వారిని వారి విద్యార్హతలు మరియు శారీరక సామర్థ్యాన్ని బట్టి ఆర్టీసీలోనే కండక్టర్, రికార్డు ట్రేసర్, అసిస్టెంట్ మెకానిక్ లేదా శ్రామిక్ వంటి పోస్టుల్లో నియమించనున్నారు. ఒకవేళ ఆర్టీసీ విభాగంలో తగిన ఖాళీలు లేకపోయినా లేదా ఆ ఉద్యోగాలకు సదరు వ్యక్తికి అర్హత లేకపోయినా, వారిని ఇతర ప్రభుత్వ శాఖల్లో నియమించేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. జిల్లా కలెక్టర్ల ద్వారా ఈ పోస్టింగ్స్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాకుండా, ఏ ఉద్యోగానికీ అర్హత లేని వారికి లేదా అనారోగ్యం కారణంగా స్వచ్ఛంద విరమణ (VRS) పొందాలనుకునే వారికి ప్రభుత్వం అదనపు ఆర్థిక ప్రయోజనాలను ప్రకటించింది. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీపీటీడీ (APPTD) కమిషనర్‌తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఉత్తర్వులు పంపింది. ప్రభుత్వ తీసుకున్న ఈ సానుకూల నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *