టాలీవుడ్ నటి ప్రగతి తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఒక బంగారు పతకం, మూడు రజత పతకాలను గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారు. కేవలం నటనలోనే కాకుండా, క్రీడారంగంలో కూడా తన సత్తా చాటుతూ.. ఏదైనా సాధించడానికి వయసు అడ్డంకి కాదని ఆమె నిరూపించారు. అయితే, ఈ విజయాల వెనుక తన పూజల ప్రభావం ఉందంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి.
తన విజయం పూజల వల్లే సాధ్యమైందని వేణుస్వామి చెప్పడంపై ప్రగతి తీవ్రంగా స్పందించారు. ఈ మెడల్స్ సాధించడం వెనుక తన కఠోర శ్రమ, నిరంతర సాధన ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. క్రీడల్లో గెలవాలంటే శారీరక దారుఢ్యం, కృషితో కూడిన ప్రాక్టీస్ అవసరమని, ఎవరో చేసిన పూజల వల్ల మెడల్స్ రావని ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు తన కృషిని తక్కువ చేసేలా ఉన్నాయని ఆమె అసహనం వ్యక్తం చేశారు.
అయితే, గతంలో తాను వేణుస్వామి వద్ద పూజలు చేయించుకున్న మాట వాస్తవమేనని ప్రగతి అంగీకరించారు. సుమారు రెండున్నరేళ్ల క్రితం తాను మానసికంగా ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనశ్శాంతి కోసం ఆ పూజలు చేయించుకున్నానని ఆమె వివరించారు. అంతేకానీ, ఇప్పుడు తాను సాధించిన క్రీడా విజయాలను పూజలకు ముడిపెట్టడం ఏమాత్రం సరికాదని ఆమె స్పష్టం చేశారు.