

తేది:23-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామశాల (జిమ్)ను జిల్లా ఎస్పీ మంగళవారం రోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. పోలీస్ సిబ్బంది రోజువారీ విధుల్లో అనేక ఒత్తిళ్లు, దీర్ఘకాలిక డ్యూటీలు, రాత్రి పహారాలు, అత్యవసర పరిస్థితుల్లో పని చేయాల్సి ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో శారీరక ఫిట్నెస్ ఎంతో కీలకమని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే పోలీస్ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరని స్పష్టం చేశారు.ఈ జిమ్లో ఆధునిక వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ అధికారులు,సిబ్బంది తమ ఖాళీ సమయాల్లో వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, వ్యాయామాన్ని రోజువారీ అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా పోలీస్ విధుల్లో ఎంతో అవసరమని అన్నారు.పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణే జిల్లా పోలీస్ శాఖ ప్రధాన ప్రాధాన్యాలలో ఒకటని,ఈ జిమ్ ద్వారా సిబ్బందిలో ఉత్సాహం పెరిగి, విధుల్లో మరింత సమర్థత సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో అహర్నిశలు కష్టపడుతున్న పోలీస్ సిబ్బందికి ఇలాంటి సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్,రాములు, ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, రఫీక్ ఖాన్, కిరణ్ కుమార్, వేణు, సైదులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.