
తేది: 22-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్.
సంగారెడ్డిజిల్లా పరిధిలో కొనసాగుతున్న జాతీయ రహదారి–65 (NH-65) విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), రెవెన్యూ, పోలీసు, ట్రాఫిక్, విద్యుత్ తదితర అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా NH-65 పనుల పురోగతి, పెండింగ్ అంశాలు, భూ సేకరణ, యుటిలిటీల మార్పిడి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
కలెక్టర్ మాట్లాడుతూ NH-65 అభివృద్ధి పనులు జిల్లాకు అత్యంత కీలకమని, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. పనుల అమలులో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని, శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
సమావేశంలో అధికారులు ఈ చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిగతులు, పెండింగ్ లో ఉన్న పనులు, భూ సేకరణ, యుటిలిటీల మార్పిడి వంటి అంశాలను కలెక్టర్కు వివరించగా, ఆయా అంశాలపై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాధురి, నేషనల్ హైవే అథారిటీ ఎస్ఈ ధర్మారెడ్డి, ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ శాస్త్రి, సంగారెడ్డి ఆర్డీఓ రాజేందర్, దేవాదాయ, విద్యుత్, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల అధికారులు, సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు పాల్గొన్నారు.