ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారో లేదో చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నీళ్లు మరియు నిజాలపై చర్చకు రావాలని సీఎం కోరితే, హరీశ్ రావు పాత మాటలనే వల్లెవేస్తున్నారని విమర్శించారు. గట్టిగా అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని, నిజంగా ధైర్యం ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, అప్పుడే తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం చేసింది ఎవరో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని ఆయన మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులు అనుభవించిన కష్టాలను ఎంపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వ కాలంలో యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడ్డారని, దానికి సంబంధించిన ఆధారాలు పత్రికా సాక్ష్యాలుగా ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ ఇప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నది గత ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు.
గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలన సరిగ్గా లేకపోవడం వల్లే ప్రజలు మార్పును కోరుకున్నారని ఎంపీ చామల పేర్కొన్నారు. అందుకే ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ పార్టీ “ప్రజా పాలన”కు పట్టం కట్టారని చెప్పారు. అహంకారంతో మాట్లాడటం మానేసి, నిర్మాణాత్మకమైన చర్చకు సిద్ధపడాలని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.