బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారన్న మాటను ఆ పార్టీ నేతలే నమ్మలేకపోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో ఇకపై తాను ప్రజల మధ్యనే ఉంటానని ఆయన ప్రగల్భాలు పలికారు. కానీ, ఆ ప్రకటన చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా కేసీఆర్ తన ఫామ్ హౌస్ గడప దాటలేదు. తాజాగా మరోసారి ‘వస్తున్నా’ అని చెబుతున్నా, ఆయన మాటలను నమ్మడానికి క్యాడర్ కానీ, ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ మానసికంగా సిద్ధంగా లేరు.
ఇటీవల తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. అయితే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ సభలకు ఆయన స్వయంగా హాజరవుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సభ ఏర్పాట్లు చేయమని చెప్పడం, తీరా సమయానికి రాకపోవడం వల్ల పార్టీ నేతల్లో నమ్మకం సడలింది. ఒకవేళ ఆయన ఇప్పుడైనా బయటకు రాకపోతే, వరుస ఓటములతో కుంగిపోయిన పార్టీ క్యాడర్ పూర్తిగా నీరుగారిపోయే ప్రమాదం ఉందని నేతలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ‘సామాజిక యాత్ర’ పేరుతో జనంలోకి వెళ్తున్నప్పటికీ, ఆమె సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి జరిగి రెండేళ్లు కావస్తున్నా, కేసీఆర్ కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫామ్ హౌస్ వదిలి ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ఎండగడతారని క్యాడర్ ఆశిస్తున్నా, కేసీఆర్ తీరు చూస్తుంటే ఇప్పట్లో కదిలేలా కనిపించడం లేదు.