ఐక్యరాజ్యసమితిలో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ధ్యాన ముద్ర: నిశ్శబ్దంలో మునిగిపోయిన ప్రపంచ వేదిక

రెండో ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా అమెరికాలోని ఐక్యరాజ్యసమితి (UN) ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘ప్రపంచ శాంతి మరియు సమరసత కోసం ధ్యానం’ అనే ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమంలో భారత్, మెక్సికో, నేపాల్, శ్రీలంక వంటి పలు దేశాల రాయబారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్ నేతృత్వంలో జరిగిన 20 నిమిషాల ధ్యాన ప్రక్రియతో నిత్యం దౌత్యపరమైన చర్చలతో సందడిగా ఉండే ఐక్యరాజ్యసమితి ప్రాంగణం ఒక్కసారిగా నిశ్శబ్దానికి వేదికైంది.

సమావేశంలో గురుదేవ్ ప్రసంగిస్తూ.. ప్రపంచ దేశాల దౌత్యవేత్తలు నిత్యం ఎదుర్కొనే పని ఒత్తిడిని జయించడానికి, సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ధ్యానం ఒక శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు. బాహ్య ప్రపంచంలో శాంతి నెలకొనాలంటే మొదట ప్రతి వ్యక్తిలో అంతర్గత శాంతి ఉండాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధులు కూడా తమ దేశాల్లోని విద్యా వ్యవస్థలో ధ్యానాన్ని చేర్చడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, భావోద్వేగ నియంత్రణ గణనీయంగా పెరిగాయని తమ అనుభవాలను పంచుకున్నారు.

ప్రపంచ ధ్యాన దినోత్సవం (డిసెంబర్ 21) సందర్భంగా న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. “World Meditates with Gurudev” పేరుతో అక్కడ భారీ బిల్ బోర్డులు వెలిశాయి. ఆదివారం నాడు గురుదేవ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందితో ప్రత్యక్షంగా ధ్యానం చేయించనున్నారు. భారతీయ ఆధ్యాత్మిక వారసత్వమైన ధ్యానం నేడు అంతర్జాతీయ వేదికలపై మానసిక శ్రేయస్సుకు మార్గదర్శిగా మారడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *