విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ముస్తాబు’ (MUSTABU) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గిరిజన విద్యార్థుల కోసం రూపొందించిన ఈ వినూత్న ఆలోచనను మెచ్చుకున్న సీఎం, దీనిని నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మరియు రెసిడెన్షియల్ పాఠశాలల్లో (1వ తరగతి నుండి ఇంటర్ వరకు) అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమం కింద ప్రతి పాఠశాలలో ‘ముస్తాబు కార్నర్స్’ ఏర్పాటు చేస్తారు. ఇందులో విద్యార్థుల కోసం అద్దాలు, దువ్వెనలు, నెయిల్ కట్టర్లు మరియు సబ్బులు అందుబాటులో ఉంటాయి. తరగతికి ఇద్దరు చొప్పున విద్యార్థి నాయకులు (లీడర్లు) ఉదయాన్నే తోటి విద్యార్థుల పరిశుభ్రతను (గోళ్లు కత్తిరించుకున్నారా, తల దువ్వుకున్నారా, యూనిఫాం శుభ్రంగా ఉందా) పర్యవేక్షిస్తారు. భోజనానికి ముందు చేతులు కడుక్కోవడాన్ని తప్పనిసరి చేస్తారు. దీనివల్ల విద్యార్థుల్లో కేవలం ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
రాష్ట్రంలోని 75 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. త్వరలోనే ఈ 75 లక్షల మందికి సమగ్ర ఆరోగ్య పరీక్షలు (Health Checkups) నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా, నాలెడ్జ్ ఎకానమీలో భాగస్వాములు కావాలని, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ‘అమ్మకు వందనం’, నాణ్యమైన విద్యా కానుక వంటి పథకాలతో పాటు ఈ ‘ముస్తాబు’ కార్యక్రమం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన భరోసా ఇచ్చారు.