బీహార్‌లో చిక్కుకున్న ఇస్నాపూర్ యువకుడు? ఆందోళనలో కుటుంబ సభ్యులు.

తేదీ: 20-12-2025 TSLAWNEWS అమీన్పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.

పటాన్చెరు :ఇస్నాపూర్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఎల్. మధుసూదన్ రెడ్డి (24) అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మధుసూదన్ రెడ్డి ఈ నెల 16న మధ్యాహ్నం 2:05 గంటల సమయంలో తన మేనమామ అన్నసారం మహేందర్ రెడ్డికి ఫోన్ చేశాడు. తాను కంపెనీ పని నిమిత్తం బీహార్ రాష్ట్రానికి వచ్చానని, ప్రస్తుతం అక్కడ తను ఏదో ఆపదలో ఉన్నానని కంగారుగా చెప్పి ఫోన్ పెట్టేశాడు.
ఆ కాల్ ముగిసిన వెంటనే అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. గత నాలుగు రోజులుగా మధుసూదన్ రెడ్డి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నా ఎటువంటి సమాచారం లభించలేదు. కంపెనీ ప్రతినిధుల నుండి కూడా సరైన స్పందన లేకపోవడంతో, అపరిచిత ప్రాంతంలో మధుసూదన్ రెడ్డికి ఏదైనా ముప్పు వాటిల్లిందా అనే ఆందోళనలో కుటుంబం ఉంది.
దీనిపై మేనమామ మహేందర్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బీహార్ పోలీసులతో సమన్వయం చేసుకుని తన మేనల్లుడిని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని వారు కన్నీటితో వేడుకుంటున్నారు. మధుసూదన్ రెడ్డి ఆచూకీ తెలిసిన వారు లేదా అతని గురించి సమాచారం ఉన్న వారు 9347848201 నంబరుకు లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *