బహుమతుల లింక్’లను క్లిక్ చేయవద్దు.

తేదీ: 20-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం, కృష్ణారెడ్డిపేట గ్రామ రిపోర్టర్ సంతోష్ బొంగురాల.

సంగారెడ్డి జిల్లా: క్రిస్మస్ గిఫ్ట్, న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ సైబర్ నేరగాళ్లు చేసే మోసాల బారిన పడవద్దని పోలీసులు హెచ్చరించారు. ఎప్పటికప్పుడు మారుతున్న సమాజంలోని పరిస్థితులకు అనుగుణంగా సైబర్ నేరగాళ్లు వారి నేర విధానాన్ని మార్చుకుంటూ ప్రజలను మోసం చేయడానికి కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని ప్రజలను హెచ్చరించారు.
పండుగ సీజన్ ప్రారంభమైన వెంటనే ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతమైన విక్రయాలు ప్రారంభమవుతాయని, దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమందికి క్రిస్మస్ గిఫ్ట్ అంటూ, న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ వాట్సాప్ లేదా ఇమెయిల్‌లో సందేశాలతో లింక్ లు వస్తుంటాయని తెలిపారు. ఆ లింక్‌లను క్లిక్ చేసి మోసపోవద్దని, “మీరు 500 డాలర్ల గిఫ్ట్ కార్డును గెలుచుకున్నారు” అని మెసేజ్‌లు వస్తుంటాయని పేర్కొన్నారు.
ఆ లింక్ లపై క్లిక్ చేసిన తర్వాత దానిలో మరో లింక్ కూడా ఉంటుందని, దీనికి ఇచ్చే ఆప్షన్స్ కూడా బాధితులను ఆ లింక్ క్లిక్ చేసే విధంగా పురికొల్పుతుంటాయని పోలీసులు వివరించారు. కాబట్టి ఎలాంటి పరిస్థితులలోనూ అపరిచితుల నుంచి వచ్చిన లింక్ లపై క్లిక్ చేయవద్దని, మీ వ్యక్తిగత సమాచారం, పాన్ కార్డు నంబర్, పాస్‌వర్డ్స్, ఫోటోలు అపరిచిత లింక్‌లలో పంచుకోవద్దని సూచించారు.
ఒకవేళ ఆ లింక్‌లో వివరాలు ఇస్తే, మీ వ్యక్తిగత వివరాలు మరియు మీ ఫోన్ నంబర్ ఆధారంగా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ఖాళీ అవుతాయని హెచ్చరించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ ఏదైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే సంబంధిత మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని కోరారు. లేదా సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కు గానీ, మీ దగ్గరలోని పోలీసు స్టేషన్ నంబర్‌కు గానీ కాల్ చేయాలని, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *