ప్రకృతి ప్రేమికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేరళలోని బ్యాక్ వాటర్స్ అందాలను తలపించేలా ఏపీలో కూడా ఆల్ట్రా లగ్జరీ హౌస్‌బోట్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కేరళ తరహాలో నీటిపై ప్రయాణిస్తూ, రాత్రి పూట బోటులోనే బస చేసే సరికొత్త అనుభూతిని పర్యాటకులకు అందించేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC) ప్రైవేటు ఆపరేటర్లకు ప్రాథమిక అనుమతులు మంజూరు చేసింది. విజయవాడలోని బెర్మ్ పార్కు మరియు బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్స్ ప్రాంతాల్లో ఈ విలాసవంతమైన పడవలు అందుబాటులోకి రానున్నాయి.
ఈ ప్రాజెక్టులో భాగంగా విజయవాడ బెర్మ్ పార్క్ నుండి పవిత్ర సంగమం వరకు 20 కిలోమీటర్ల మేర రెండు భారీ బోట్లు నడవనున్నాయి. ఒక బోటులో 5 బెడ్రూంలతో పాటు 100 మంది పట్టే కాన్ఫరెన్స్ హాల్ ఉండగా, మరో బోటును 200 మంది ఒకేసారి డిన్నర్ చేసే విధంగా డిజైన్ చేస్తున్నారు. అటు సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్‌లో నాగరాజు కెనాల్ నుండి నిజాంపట్నం వరకు 30 కిలోమీటర్ల మేర మరో మూడు బోట్లు రాకపోకలు సాగిస్తాయి. వీటిలో 9, 3 మరియు 2 బెడ్రూంల వసతి కలిగిన పడవలు ఉండనున్నాయి. పర్యాటకులు రాత్రి వేళల్లో భవానీ ద్వీపం లేదా సూర్యలంక బ్యాక్ వాటర్స్ వద్ద ప్రశాంతంగా బస చేయవచ్చు.
ప్రస్తుతం ఈ బోట్ల నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్‌లను ఇన్‌లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆమోదించాల్సి ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2026 అక్టోబరు నాటికి ఈ విలాసవంతమైన పడవలు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి సేవలపై ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. ఈ కొత్త పర్యాటక విధానం వల్ల రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడమే కాకుండా, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు ఆశిస్తున్నారు.