


తేది:17-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
గ్రామస్తులు, యువత పోలింగ్ సిబ్బందితో ఘర్షణ.
గ్రామస్తులు పోలీసులపై రాళ్లు విసరడంతో పాటు పోలీసు వాహనాలను ధ్వంసం .
పోలీసులు గాయపడినట్లు సమాచారం.
పోలీసుల లాఠీచార్జ్,గాల్లోకి కాల్పులు.
జగిత్యాల జిల్లా: వెల్గటూరు మండలం పైడిపల్లిలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు చేశారంటూ రెండు వర్గాలు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపారని సమాచారం.కొందరు వ్యక్తుల జోక్యంతో సర్పంచ్ ఎన్నిక ఫలితాన్ని మార్చారని ఆరోపిస్తూ ఓ అభ్యర్థికి మద్దతుగా గ్రామస్తులు, యువత పోలింగ్ సిబ్బందితో ఘర్షణకు దిగారు. బ్యాలెట్ బాక్స్‌లను బయటకు తరలించకుండా పోలింగ్ కేంద్రం ఎదుట గ్రామస్తులు బైఠాయించి నిరసన చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామస్తులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ, వారు రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలింగ్ కేంద్రం ముందు ఆందోళన కొనసాగించారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపి గుంపును చెదరగొట్టారు. గ్రామస్తులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఒక పోలీసు గాయపడినట్లు సమాచారం. అనంతరం పోలీసులు కొంతమంది యువకులను అదుపులోకి తీసుకొని, బ్యాలెట్ బాక్స్‌లను పోలింగ్ కేంద్రం నుంచి తరలించారని సమాచారం. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి భారీగా పోలీసు బలగాలను గ్రామంలో మోహరించారని సమచారం.