టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున తన దానగుణాన్ని చాటుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని అక్కినేని నాగేశ్వర రావు (ANR) కాలేజీ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, అక్కినేని కుటుంబం తరపున భారీ విరాళాన్ని ప్రకటించారు. తన తండ్రి ఏఎన్నార్ జ్ఞాపకార్థం, కాలేజీ అభివృద్ధి కోసం రెండు కోట్ల రూపాయల విరాళం ఇస్తున్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావుకు ఈ కాలేజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. “నాన్నగారు 1959వ సంవత్సరంలోనే ఈ కాలేజీకి లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. అప్పట్లో ఆ విరాళం చాలా పెద్దది. ఆయన స్ఫూర్తితో ఇప్పుడు మేం విరాళం ఇవ్వకపోతే బాగుండదని ఈ నిర్ణయం తీసుకున్నాం” అని తెలిపారు. తన సోదరుడు వెంకట్, సోదరి సుశీల మరియు ఇతర కుటుంబ సభ్యులందరి అంగీకారంతోనే ఈ విరాళం అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఈ రెండు కోట్ల రూపాయల నిధిని విద్యార్థుల ప్రయోజనాల కోసం వినియోగించనున్నారు. ముఖ్యంగా తమ తల్లిదండ్రుల పేరిట స్కాలర్‌షిప్‌లు ఏర్పాటు చేసి, ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అండగా నిలవాలని అక్కినేని కుటుంబం నిర్ణయించింది. కాలేజీ మేనేజ్‌మెంట్ సభ్యులతో చర్చించి, ఈ స్కాలర్‌షిప్‌ల విధివిధానాలను త్వరలోనే ఖరారు చేస్తామని నాగార్జున పేర్కొన్నారు. ఇటీవల ‘కుబేర’ సినిమాతో వంద కోట్ల వసూళ్లు సాధించిన నాగ్, అటు సినిమాలు చేస్తూనే ఇటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుండటం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.