తెలంగాణలోని మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. స్త్రీనిధి రుణాల చెల్లింపుల్లో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు మరియు సభ్యులకు సౌకర్యవంతంగా ఉండేలా ‘మన స్త్రీనిధి’ (Mana Stree Nidhi) అనే కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో లోన్ వాయిదాలు (EMIs) చెల్లించడానికి బ్యాంకులకో లేదా గ్రామీణ స్థాయి సిబ్బందికో ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నేరుగా ఈ యాప్ ద్వారా మహిళలు తమ ఇంటి వద్ద నుంచే చెల్లింపులు చేసుకోవచ్చు.
ఈ యాప్ ముఖ్య ఉద్దేశ్యం రుణ చెల్లింపుల్లో పారదర్శకతను పెంచడం. సాధారణంగా మహిళలు తమ ఈఎంఐలను గ్రామదీపికలు లేదా పట్టణాల్లోని ఆర్పీలకు ఇస్తుంటారు. అయితే, కొంతమంది సిబ్బంది ఆ డబ్బును సభ్యుల ఖాతాల్లో జమ చేయకుండా సొంతానికి వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ‘మన స్త్రీనిధి’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా సభ్యులు తాము గతంలో ఎంత లోన్ తీసుకున్నారు, ఎంత చెల్లించారు, ఇంకా ఎంత బకాయి ఉంది వంటి వివరాలను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.
ఈ సేవలను పొందాలనుకునే వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, తమ ఫోన్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. ఒకవేళ ఫోన్ నంబర్ అప్‌డేట్ కాకపోతే సంబంధిత అధికారులను సంప్రదించి అప్‌డేట్ చేయించుకోవచ్చు. యాప్‌లో ‘మన స్త్రీనిధి తెలంగాణ’ అని టైప్ చేస్తే కట్టాల్సిన నెలవారీ వాయిదా కనిపిస్తుంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వానికి డబ్బు చేరుతుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ వెసులుబాటుతో మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక లావాదేవీల విషయంలో మరింత నిశ్చింతగా ఉండవచ్చు.